Congerss Minister : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, కాంగ్రెస్ భవిష్యత్ లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల నుండి సన్న బియ్యం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా హుజూర్ నగర్ నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాం,” అని తెలిపారు.
తెలంగాణలో 84% మందికి సన్న బియ్యం అందించనున్నామని, ఇది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటి, ప్రజల కడుపు నింపే ప్రణాళికను కార్యరూపం దిద్దుతున్నామని ఆయన తెలిపారు. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇది నాకు గర్వకారణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ప్రభుత్వం కాలంలో తెలంగాణకు రావాల్సిన వాటా పూర్తిగా రాబట్టలేకపోయారని విమర్శించారు. “కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కానీ, కొత్త ప్రభుత్వం ఈ విషయంలో రాజీపడదు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని ఆరోపించారు. “బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పరిపాలనలో నల్లగొండ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే వారికెక్కువ.” “ఏపీ జలదోపిడిని ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థంగా అడ్డుకున్నారు.” “10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డికి SLBC ఎక్కడ ఉందో తెలుసా?” అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు మొహం చూపించబోరని వెంకట రెడ్డి తేల్చి చెప్పారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో మెజారిటీతో గెలుస్తుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. SLBC ప్రాజెక్టు అభివృద్ధిపై గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ, “నేను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసి SLBC ప్రాజెక్ట్ పూర్తి చేయాలని గత ప్రభుత్వాన్ని వేడుకున్నా, కానీ బీఆర్ఎస్ కనికరించలేదు” అని పేర్కొన్నారు. SLBC సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, “ఈ ప్రమాదం మాకు చాలా బాధను కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
CSK vs MI : రెండూ పెద్ద టీంలు.. హోరా హోరీ పోరు.. గెలుపు ఎవరిది?