Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాల చెల్లింపుల కోసం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి – సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు కార్మికులు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని వాపోయారు. తమ న్యాయమైన జీతాలను అడిగితే గ్రామపంచాయతీ ఈవో లక్ష్మణ్ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Supreme Court: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కీలక ఆదేశాలు
ఈ పరిస్థితిని గమనించిన ఎంపీడీవో (MPDO) రాజేందర్ అక్కడికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారం రోజుల్లోగా జీతాలు చెల్లింపులు జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు. కార్మికుల ఆందోళనతో గ్రామస్థులు, రోడ్డుపై ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని కార్మిక సంఘాలు తెలిపాయి.