బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మనసులో మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ కోసం ఆయన ఇటీవలే షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో, సౌదీ అరేబియాలో జరిగిన ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్’కు హాజరయ్యారు. ఆ వేదికపైనే తన మనసులోని భావోద్వేగాలను పంచుకున్నారు. అక్కడ వేదికపై సల్మాన్ చేసిన కామెంట్లు ఆయన అభిమానులనే కాదు, ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరిచాయి.
Also Read : NTR-Neel : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌పై క్లారిటీ..!
‘గత పాతికేళ్లలో నేను బయట డిన్నర్ చేసి ఎరుగను. నా ప్రపంచం అంతా ఇల్లు, షూటింగ్ లొకేషన్లు, ఎయిర్‌పోర్టులకే పరిమితమైంది. మీకు తెలియని విషయం ఏమిటంటే.. మీరు అనుకున్నంత సంతోషంగా నేను లేను. నా ప్రాణ స్నేహితుల్ని చాలా మందిని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నాకంటూ మిగిలింది కేవలం నలుగురు ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ సల్మాన్ భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు, తన నటన గురించి మాట్లాడుతూ ఆయన తనపై తానే సెటైర్ వేసుకోవడం విశేషం.. ‘నేను పెద్ద స్టార్‌ను మాత్రమే, కానీ గొప్ప నటుడ్ని మాత్రం కాదు. నాకు తోచినట్టు నటిస్తాను అంతే. నేను ఎమోషనల్ సీన్స్‌లో ఏడిస్తే, ప్రేక్షకులు నవ్వుతారు’ అని అన్నారు. అయితే, సల్మాన్ మాటలకు ఆయన అభిమానులు బాధపడి, సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.. ‘మీరలా మాట్లాడటం సరికాదు. తెరపై మీరు ఎమోషనల్‌గా కనిపిస్తే మేం కూడా భావోద్వేగానికి గురవుతాం. మీరు ఎంత గొప్ప నటులో ‘భజరంగీ భాయిజాన్’ లాంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు.