దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లోని మొదటి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో రబాడ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రబాడ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 332 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో రబాడ అత్యుత్తమ గణాంకాలు 7/112 కాగా.. 10 వికెట్స్ నాలుగు సార్లు, 5 వికెట్స్ 17 సార్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన వీరుడిగా డేల్ స్టెయిన్ ఉన్నాడు. స్టెయిన్ 93 టెస్టుల్లో 439 వికెట్స్ తీశాడు. షాన్ పొల్లాక్ (421), మఖాయా ఎంతిని (390) కగిసో రబాడ కంటే ముందున్నారు. తాజా ఇన్నింగ్స్‌తో అలెన్ డోనాల్డ్‌ను రబాడ బ్రేక్ చేశాడు. డోనాల్డ్ 72 టెస్టు మ్యాచుల్లో 330 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో ఎవరూ కూడా 200 వికెట్స్ కూడా పడగొట్టలేదు. కేశవ్ మహారాజ్ (199) డబుల్ సెంచరీకి ఓ వికెట్ దూరంలో ఉన్నాడు. మార్కో జాన్సెన్ (76) 100 వికెట్స్ కూడా చేరువలో లేడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా కగిసో రబాడ నిలిచాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ బౌలర్ కైల్ జెమీసన్ 2021లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గానూ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు 1998లో ఐసీసీ నాకౌట్ ఫైనల్‌లో జాక్వస్ కలిస్ (30/5) ఐదు వికెట్స్ ప్రదర్శన చేశాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ మైదానంలో మూడు టెస్ట్‌లు ఆడిన రబాడ 18 వికెట్లు తీశాడు. దాంతో దక్షిణాఫ్రికా తరఫున లార్డ్స్‌లో ఎక్కువ వికెట్లు కూల్చిన రికార్డు రబాడ సొంతమైంది. ఈ రికార్డు ఇంతకుముందు మోర్నే మోర్కెల్ (15 వికెట్లు) పేరిట ఉంది.