బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ తుది జట్టుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బెంగళూరులో వర్షం పడుతోందని, పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు కచ్చితంగా ఉంటారని, పరిస్థితులను బట్టి మూడో స్పిన్నర్‌ను తీసుకోవాలా? వద్దా? అనే విషయం ఆలోచిస్తామని రోహిత్ తెలిపాడు. మంగళవారం ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ పలు విషయాలపై స్పందించాడు.
‘బెంగళూరులో వర్షం పడుతోంది. పిచ్ కవర్ల కిందే ఉంది. జట్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవాలా లేదా అనే అంశంపై రేపు ఉదయం నిర్ణయం తీసుకొంటాం. తుది జట్టు ప్రకటన కూడా అప్పుడే ఉంటుంది. పరిస్థితులు ఎలా మారుతున్నాయో గమనించి నిర్ణయం తీసుకొంటాం. కాన్పూర్ మ్యాచ్‌లో రెండు రోజులు ఆట సాగలేదు. అయినా విజయం కోసం మేం బరిలోకి దిగాము. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. గెలుపు కోసమే మేము ఆడతాము’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read: IND vs NZ: మరో 53 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ!
బెంగళూరు టెస్టులో ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సహా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.