ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నిక కావాలని కోరుతూ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీర్మానాన్ని బలపరిచారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని బలపరిచారు. మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి రాజకీయ తీర్మానం బలపరిచారు. వీరితో పాటు.. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, వి. హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్ లు తదితరులు బలపరిచారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని విచిన్నం చేయడానికి బీజేపీ విద్వేషాన్ని నింపుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని, ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఆయన అన్నారు.