రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్‌లోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. బ్రిటీష్ విధానాలనే బీజేపీ అమలు చేస్తుందని, బీజేపీని ఈ రోజు నుంచి బ్రిటీష్ జనతా పార్టీగా పిలుద్దామని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడన్నారు. వల్లభాయ్ పటేల్ కి మీ పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్ కి పునాది వేసింది కూడా వల్లభాయ్ పటేలే అని, అదానీ కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క సూరత్ నుంచే మొదలైందన్నారు.
Also Read : Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు
బ్రిటీష్ తెచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క బీజేపీ కూడా అదానీ కంపెనీలతో దేశ సంపదను కొల్లగొడుతుందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలో గుజరాత్ లో కేస్ ఎలా వేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. అదానీ దోపిడీపై పార్లమెంటులో మోడీని రాహుల్ కడిగేశారని, రాహుల్ గాంధీని చూడాలంటే మోడీకి భయం పట్టుకుందన్నారు. అదానీ కంపెనీలో 23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరో తేలాలి? అని ఆయన డిమాండ్ చేశారు. అదానీ దొంగతనం చేశారంటే మోడీ ఎందుకు భయపడుతున్నాడని, అదానీపై ఈడీ విచారణ జరగాలంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. ఫిబ్రవరి 7న రాహుల్ గాంధీ మాట్లాడితే.. 16న హైకోర్టులో స్టే తెచ్చుకున్న కేసును ఓపెన్ చేశారన్నారు. ఫిబ్రవరి 27న కిందికోర్టులో కేసు విచారణ మొదలుపెట్టారని, మార్చి 23న రాహుల్ గాంధీకి శిక్ష వేశారన్నారు. కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజులు గడువు ఇచ్చిందని, కానీ తెల్లారగానే పార్లమెంటులో రాహుల్ గాంధీని అనర్హత వేటు వేశారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒక ఇంజన్ అదానీ… రెండో ఇంజన్ ప్రధాని అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అదానీ ఇంజన్ రిపేరుకు రాగానే ప్రధాని ఇంజన్ పాడైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పప్పు అని చెప్పిన బీజేపీకి ఇప్పుడు నిప్పులా కనపడుతున్నాడని, అందుకే నిప్పును అడ్డు తొలగించుకోవాలని మోడీ కుట్ర చేశాడని ఆయన ఆరోపించారు.
Also Read : YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ