Operation Cambodia: కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది. మొదటి రోజు 25 మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు. కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం 58 మంది యువకులు చిక్కుకున్నారు. దశలవారీగా మిగతా వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. ఏడాదిలో ఒక్క విశాఖపట్నం నుంచే సుమారు రూ.120 కోట్ల దోపిడి జరిగింది.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మంది వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ కంబోడియా కోసం 20 మంది పోలీసులతో సిట్ ఏర్పాటు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మూలాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బృందాలు వెలికి తీస్తున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు జాయింట్ సీపీ ఫకిరప్ప నాయకత్వం వహిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు పంపించే 70 ఏజెన్సీలపై విశాఖ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Read Also: Sexual harassment case: బెంగాల్ గవర్నర్కు చెందిన ఓఎస్డీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ డొంక కదిలింది. ఈ క్రమంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుగా నమోదు చేసి విశాఖ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై భారత ఎంబసీ అధికారు ఆపరేషన్ కంబోడియాను చేపట్టారు. 420 మంది వరకు భారతీయులు సైబర్ నేరాల బారిన పడ్డారని వారు గుర్తించారు. బాధితులు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. అందులో 360 మందిని కంబోడియా పోలీసుల చెర నుంచి సురక్షితంగా కాపాడారు. ఈ క్రమంలో వారు కంబోడియా నుంచి సురక్షితంగా భారత్ కు చేరుకున్నారు.