Smriti Mandhana on Virat Kohli To Win IPL Title: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తనకు మధ్య పోలిక సరికాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన అన్నారు. టైటిల్ ముఖ్యమైందే కానీ భారత జట్టు తరఫున విరాట్ ఎన్నో సాధించాడన్నారు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ‘ఆర్‌సీబీ అన్‌బాక్స్’ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్‌సీబీని పురుషుల ఆర్‌సీబీ జట్టు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించుకుంది.
ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో స్మృతి మంధన పాల్గొనగా.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. విరాట్ కోహ్లీ సాధించలేని ఘనతను మీరు అందుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారనే ప్రశ్నకు స్మృతి మంధన మాట్లాడుతూ… ‘ఆర్‌సీబీ జట్టుకు టైటిల్ ముఖ్యమే. కానీ భారత జట్టు తరఫున విరాట్ కోహ్లీ ఎన్నో సాధించాడు. మా ఇద్దరి మధ్య పోలిక సరికాదు. పోలికలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. విరాట్ అద్భుత ఆటగాడు. ప్రతిఒక్కరికి అతడు స్ఫూర్తి. ఒక్క టైటిలే అన్ని విషయాలను చెప్పదు. మేమంతా కోహ్లీని ఎంతో గౌరవిస్తాం’ అని చెప్పారు.
Also Read: Virat Kohli-IPL Title: ఆర్‌సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం: విరాట్ కోహ్లీ
‘నేను, విరాట్ కోహ్లీ 18వ నంబరు జెర్సీ వేసుకుంటాం. ఆ నంబరు ఆధారంగా మా ఇద్దరినీ పోల్చడం సరికాదు. ఆర్‌సీబీ పురుషుల జట్టు గొప్ప క్రికెట్ ఆడినా.. దురదృష్టవశాత్తు కప్పు గెలవలేకపోయింది. ఈసారి టైటిల్ గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఆర్‌సీబీ ఫ్రాంఛైజీకి చెందిన పురుషులు, మహిళల జట్లను వేరు వేరుగా చూడాలి. అంతేకాని పోలిక మాకు ఇష్టం లేదు’ అని స్మృతి మంధన పేర్కొన్నారు. డబ్ల్యూపీఎల్ 2024 తాజాగా ముగియగా.. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేతో ఆర్‌సీబీ తలపడనుంది.