Virat Kohli React on RCB Title: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం అని ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందన్నాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు తమపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే నెరవేరుస్తామని కింగ్ తెలిపాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో విరాట్ పాల్గొన్నాడు.
‘మహిళల ఆర్‌సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు మేం అందరం మ్యాచ్ చూసాం. ఆ సమయంలో ఆర్‌సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యా. ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగింది. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తాం. 16 ఏళ్లలో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా.. టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చా. అందుకోసం ప్రతిసారి శాయశక్తులా కృషి చేశా. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్‌సీబీ జట్టులో ఉండాలన్నది నా కోరిక. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మరువలేను. టైటిల్ గెలిచి రుణాన్ని తీర్చుకుంటా’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
Also Read: Lok Sabha Elections 2024 : ఫోన్లలో మెసేజులు.. బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్ ఆర్‌సీబీకి పురుషుల ఆర్‌సీబీ జట్టు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చింది. ఈ సందర్భంగా విరాట్ కొహ్లీ సహచరులతో కలిసి చప్పలు కొడుతూ ఛాంపియన్స్‌ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఆపై మహిళా క్రికెటర్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. చాలా రోజుల తరువాత విరాట్ మైదానంలోకి రావడంతో.. చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోయింది. ఇక ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేతో ఆర్‌సీబీ తలపడనుంది.