Father Kills Son in Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు రక్తపాతం దాకా వెళ్లి.. దారుణానికి దారితీశాయి. మద్యం మత్తులో ఉన్న కొడుకు తండ్రిపై దాడి చేయగా.. దాడి నుంచి తప్పించుకున్న తండ్రి కన్న కొడుకునే మట్టుబెట్టాడు. ఆపై ఆత్మహత్యలా చిత్రీకరించి పోలీసులకు దొరికిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హంతకుడైన తండ్రి కోసం గాలిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
మద్యం మత్తులో ఉన్న సనావుల్లా (28) తన తండ్రి షంషుద్దీన్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ దాడి నుంచి తప్పించుకున్న తండ్రి.. తన ప్రాణానికి ముప్పు ఉందన్న భయంతో కొడుకుపై ప్రతిదాడి చేశాడు. ఈ క్రమంలో కొడుకును కొట్టి చంపాడు. ఆ తర్వాత చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సనావుల్లా మృతదేహాన్ని ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Also Read: Michael Clarke: క్లార్క్ ముక్కుపై మరో కట్.. డజన్‌కు పైగా చికిత్సలు!
సనావుల్లా వంటిపై గాయాలు స్పష్టంగా కనిపించడంతో ఇది హత్య కేసని రాయచోటి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడు తండ్రి షంషుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునే పనిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సనావుల్లా తరచూ మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవపడడమే ఈ హత్యకు కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.