Ravi Shastri Feels KL Rahul not wanted for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఆసియా కప్ 2023 కోసం ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ జట్లు తమ టీంలను ప్రకటించగా.. భారత్ ఇంకా వెల్లడించలేదు. ఆగష్టు 20న బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. తాను కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్ తుది జట్టులో ఆడించనన్నాడు.
గాయపడిన భారత స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. ఆసియా కప్ 2023 కన్నా ముందు వాళ్లు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. అందుకే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రి మాత్రం ఆసియా కప్ 2023కు రాహుల్ వద్దు అని అంటున్నాడు. గాయం నుంచి కోలుకుంటూ.. కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆటగాడిని ఆడించడం సరికాదు అని అన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘గాయం నుంచి కోలుకుంటున్నా కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆటగాడిని నేరుగా తుది జట్టులోకి తీసుకోవడమంటే.. ఎక్కువగా ఆశించడమే అవుతుంది. ఇప్పుడు కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్ 2023లో ఆడించాలని చుస్తున్నారు. అతడితో వికెట్ కీపింగ్ చేయించడం గురించి మాట్లాడుతున్నారు. మోకాలి గాయం నుంచి కోలుకుని వచ్చిన రాహుల్‌తో కీపింగ్ చేయించడం అస్సలు మంచిది కాదు. గాయపడ్డ ఆటగాళ్లను తిరిగి ఆడించడానికి తొందర పడొద్దు. బుమ్రా విషయంలో ఇలాగే చేశారు. మూడు సార్లు తొందరపడంతో ఏకంగా 11 నెలలు ఆటకు దూరమయ్యాడు’ అని అన్నాడు.
Also Read: Thursday Remedies: గురువారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!
‘ఇషాన్ కిషన్ గత 15 నెలలుగా బాగా కీపింగ్ చేస్తున్నాడు. ఆసియా కప్ 2023లో మరో ఆటగాడి గురించో ఆలోచించడం ఎందుకు. అతడితోనే కీపింగ్ చేయించాలి. ఇక తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావాలనుకుంటే.. అతడు మంచి అప్షన్. గత 3 నెలల్లో ఐపీఎల్‌లో, భారత్ తరఫున గొప్పగా ఆడాడు. రవీంద్ర జడేజా సహా టాప్-7లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ ఆటగాళ్లు జట్టులో ఉండాలి. తుది జట్టులో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ల సంఖ్య పెరగాలి’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.