జంతు ప్రేమికురాలిగా గుర్తింపు పొందిన యాంకర్ రష్మి గౌతమ్, కుక్కల సమస్యపై ఇటీవల జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. రేణు దేశాయ్‌తో కలిసి సోమవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో రష్మి తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, సమాజంలో జంతువుల పై జరుగుతున్న హింసల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై ఇటీవల జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘మన సంస్కృతి కేవలం బట్టల వద్దే ఆగిపోయింది’ అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. సంస్కృతి అంటే కేవలం వేసుకునే దుస్తులు కాదని, తోటి జీవుల పట్ల చూపే కరుణ అని ఆమె గుర్తు చేశారు. పూర్వం అన్నం వండితే మొదటి ముద్ద ఆవుకు, కుక్కకు పెట్టే సంప్రదాయం ఉండేదని, ఆ గొప్ప కల్చర్‌ను మర్చిపోయి ఇప్పుడు కేవలం బట్టల మీద పడి కొట్టుకోవడం విచారకరమని ఆమె పేర్కొన్నారు. అంతే కాదు..
Also Read : Ilaiyaraaja: ఇళయరాజా ఖాతాలో.. మరో ప్రతిష్టాత్మక అవార్డు!
కుక్కలు మనుషులను కరుస్తున్నాయని వాటిని చంపాలని చూడటం సరికాదని, అసలు సమస్య ఏంటో గుర్తించాలని కోరిన రష్మి .. ‘మనకు అడ్డంగా ఉన్నాయని నోరు లేని జీవులను తొలగించుకుంటూ పోతే.. రేపు పొద్దున్న ముసలివారైన మన అమ్మానాన్నలు అడ్డుగా ఉన్నారని వారిని కూడా తొలగిస్తామా?’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మనం రుచి కోసం మూగ జీవులను చంపి తింటున్నామని, పాలు ఇచ్చే ఆవు దూడకు అందాల్సిన జున్ను పాలను కూడా వదలకుండా తాగేస్తున్నామని, ఇలా ప్రతి చోట హింస కనిపిస్తోందని రష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కూడా కేవలం కుక్కల వల్ల జరిగే ప్రమాదాలనే హైలైట్ చేస్తోందని, కానీ వాటికి ఎదురవుతున్న కష్టాలను ఎవరూ చూపడం లేదని ఆమె మండిపడ్డారు. జంతువుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలని, అవి కూడా ఈ ప్రకృతిలో భాగమేనని రష్మి తెలిపింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.