Nepal President: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లను సాధించినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.ఫెడరల్ పార్లమెంట్‌లోని 313 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే ప్రావిన్స్ అసెంబ్లీల నుండి 518 మంది సభ్యులు తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఖాట్మండులోని న్యూ బనేశ్వర్‌లోని నేపాల్ పార్లమెంట్ భవనంలో ఓటింగ్ జరిగింది.
నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ కు 214 మంది ఎంపీలు, 352 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఓటు వేశారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేత అయిన రామచంద్ర పౌడెల్ .. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బా హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నా మిత్రుడు రామచంద్ర పౌడెల్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Tamil Nadu: అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు.. పొత్తు సంగతేంటి?
నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఓట్లు 882. వారిలో 332 మంది పార్లమెంటు సభ్యులు కాగా, 550 మంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 52,786 ఓట్ల వెయిటేజీ ఉంటుంది. అత్యున్నత పదవిని దక్కించుకోవడానికి అభ్యర్థి చాలా ఓట్లను సాధించాలి. ఫెడరల్ పార్లమెంట్ శాసనకర్త యొక్క ఒక ఓటు వెయిటేజీ 79 మరియు ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యునిది 48.
518 మంది అసెంబ్లీ సభ్యులు, 313 మంది పార్లమెంటు సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని నేపాల్ ఎన్నికల సంఘం అధికార తెలిపారు. 2008లో నేపాల్ రిపబ్లిక్ గా అవతరించాక, దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి. కాగా, అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (RPP) ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.