దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. కేంద్రం ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ ఆశావహుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఆర్ఎస్ తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా అగ్నిపథ్ స్కీమ్ పై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకించారు. ఈ పథకాన్ని నిలిపివేయడానికి దేశవ్యాప్తంగా మరో ఉద్యమం అవసరం అని ఆయన వ్యాఖ్యానించాడు. రైతుల సమస్యలపై దేశానికి ఇప్పుడు మరో పెద్ద ఉద్యమం అవసరం అని ఆయన అన్నారు. ఇప్పటి వరక యువత సాయుధ దళాల్లో కనీసం 15 ఏళ్లు సేవ చేసి, పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ పొందుతున్నారని.. కానీ ఈ పథకం అమలయితే సాయుధ దళాల్లో పని చేసిన తర్వాత పెన్షన్ లేకుండా ఇంటికి వెళ్తారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ లాజిక్ తీరే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇదే విధమైన చట్టం ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని నిలిపివేయడానికి మరో ఉద్యమం అసవరం అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు 90 ఏళ్ల వరకు పోటీ చేసే అవకాశం ఉంటుందని.. వారికి కూడా ఇదే విధంగా అమలయ్యే చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల తర్వాత యువతకు రిటైర్మెంట్ విధించడం అన్యాయమని రాకేష్ టికాయత్ అన్నారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేఖంగా బీకేయూ ఉద్యమిస్తుందని ఆయన అన్నారు. రైతు చట్టాల ఉపసంహరణ గురించి మాట్లాడుతూ.. రైతులు ఢిల్లీకి వెళ్లే దారి చూశారని.. నాలుగు లక్షల ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రాన్ని హెచ్చరించారు.