పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోలాహలం మధ్య ఫూలో దేవి ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకుందని సమాచారం. తోటి ఎంపీలు వెంటనే స్పందించి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
అంబులెన్స్ లో ఫూలో దేవిని పార్లమెంట్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆప్‌కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ముందు కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. ఫూలో దేవి నేతమ్ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని కొండగావ్ నివాసి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ఛత్తీస్‌గఢ్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె 14 సెప్టెంబర్ 2020న కాంగ్రెస్ సభ్యురాలిగా ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత ఏడాది ఆగస్టులో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఫూలో దేవి నేతమ్‌తో సహా 12 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ దోషులుగా నిర్ధారించింది. భవిష్యత్తులో ఇలా ప్రవర్తించవద్దని నాడు ఈ సభ్యులను హెచ్చరించారు.
READ MORE: Ram Mohan Naidu: కూలిన టెర్మినల్ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..
కాగా.. పార్లమెంట్ తొలి సమావేశాల్లోనూ విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన నీట్ పరీక్ష పేపర్ లీక్, ఇతర వివాదాలపై చర్చ కోరుతూ విపక్షాలు ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని అడ్డుకున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నీట్ పై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది.