Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గురువారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం ఆయన చేపట్టిన తొలి పర్యటన ఇది. ఈ పర్యటనలో రక్షణ మంత్రి భారత సాయుధ దళాల సిద్ధతను సమీక్షించారు. పాక్ సరిహద్దుల్లో పడిన షెల్స్‌ను పరిశీలించారు. అనంతరం శ్రీనగర్ లోని ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి జవాన్లతో ముచ్చటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నేను వందనం చేస్తున్నాను. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకూ నివాళులు అర్పిస్తున్నాను. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్‌ను “భారత వైమానిక దళాల అతిపెద్ద ప్రతీకార చర్య”గా అభివర్ణించిన రాజనాథ్ సింగ్, ఉగ్రవాదాన్ని నివారించేందుకు అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులను అక్కడ అడ్డుకోవాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఆపాలని ఆయన పేర్కొన్నారు.
Read Also: Murder : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం.. టీ తాగడానికి వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై హత్య
ఈ సందర్బంగా ఆయన ఓ ప్రశ్నను లేవనెత్తారు. “పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన అంతర్జాతీయ సమాజం జోక్యం అవసరమని సూచించారు. ఇటీవల పాక్ సాయుధ దళాలు భారత ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై దాడి ప్రయత్నం చేశాయి. పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా పాక్ జేఎఫ్-17 యుద్ధవిమానాల నుంచి హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. అయితే, భారత్ ఈ ఆరోపణలను ఖండించింది.