Royal Enfield Flying Flea: ప్రఖ్యాత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరిలోగా (జనవరి – మార్చి 2026 మధ్య) ఈ బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. “ఫ్లయింగ్ ఫ్లీ” (Flying Flea) పేరుతో కొత్తగా స్థాపించిన ఉప బ్రాండ్ కింద ఈ ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులోకి రానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్న రెండు ఎలక్ట్రిక్ బైకులలో ఒకటి C6, మరొకటి S6. ప్రస్తుతం ఇవి టెస్టింగ్ దశలో ఉన్నాయి. C6 క్లాసిక్ స్టైల్‌తో వస్తుండగా, S6 స్క్రాంబ్లర్ మోడల్‌గా డిజైన్ చేయబడుతోంది. ఇది రోడ్డు మీద పాటు.. ఆఫ్ రోడ్ రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
Read Also: Murder : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం.. టీ తాగడానికి వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై హత్య
ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి రానున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్ C6 అవుతుంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాలు ఎలా సాగించాలన్న దానిపై రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఉన్న డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలా? లేక ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా షోరూములు ఏర్పాటు చేయాలా? లేదా డైరెక్ట్ టు కస్టమర్ (D2C) మోడల్‌ను అనుసరించాలా అన్నదానిపై సంస్థలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తుది నిర్ణయం సెప్టెంబర్ 2025 నాటికి తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వ్యాపార విభాగానికి రూ. 1,500 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. దీనిలో R&D, డిజైన్, ఉత్పత్తి ఇంకా రిటైల్ వ్యూహాలు కూడా ఉన్నాయి.
ఇంతకుముందు, డిసెంబర్ 2022లో ఈషర్ మోటార్స్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరెంట్ కంపెనీ), యూరప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ స్టార్క్ ఫ్యూచర్ S.L.తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం కింద ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా స్టార్క్ సంస్థ బ్యాటరీ టెక్నాలజీ, మోటార్లు, మోటార్ కంట్రోలర్లు, మెటీరియల్ సెలెక్షన్ వంటి అంశాల్లో తన సహకారం అందించనుంది. మరోవైపు, ఈషర్ మోటార్స్ నిర్వహణ, విడిభాగాల కొనుగోలు, కొన్ని కీలక భాగాల తయారీ బాధ్యతలు చేపడుతుంది.