Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.. దీనికి ప్రధాన కారణం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అక్కడే రిమాండ్‌లో ఉన్నారు.. అయితే.. చంద్రబాబు జైలుకు వచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడంపై చర్చ సాగింది.. దీనిపై వ్యక్తిగత కారణాలు వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగలేదు.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి కన్నుమూశారు.. ఆమె వయస్సు 46 ఏళ్లు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిరణ్మయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచారు.. కిరణ్మయి మృతికి జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీష్ సహా పలువురు అధికారులు సంతాపం తెలిపారు.
Read Also: Telangana Rains: తెలంగాణలో భారీ వానలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
ఇక, రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై విమర్శలపై మండిపడుతున్నారు అధికారులు.. దీనిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోయిన విషయంపై మీడియా వక్రీకరించి వార్తలను ప్రచురించవద్దని జిల్లా ఎస్పీ, కోస్తా జిల్లాల జైళ్ళ శాఖ డీఐజీ పేర్కొన్నారు. రాజమండ్రి లోని నవీన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రాహుల్ భార్య కిరణ్మయి చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు డీఐజీ శుక్రవారం రాత్రి తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని రెండు రోజుల క్రితం సెలవు తీసుకొని వెళ్లినట్లు జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ రాహుల్ భార్య చనిపోయినట్లు తెలిపారు. ఇలాంటి బాధాకర సమయంలో.. జైలు ఉన్నతాధికారుల వద్ద క్లారిఫికేషన్ తీసుకుని మీడియా ప్రతినిధులు వాస్తవాలు రాయాలని డీఐజీ సూచించారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారని, అధికారులు బలవంతంగా పంపించారనే వార్తలను ఖండించారు డీఐజీ రవికిరణ్. బాధలో ఉన్న అధికారుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలిపారు. అధికారులు ఎప్పుడూ తమ బాధ్యతలను విస్మరించరని పేర్కొన్నారు. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ గారి విషయంలో అవాస్తమైన వార్తలు వచ్చాయని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. రాహుల్ విషయంలో మీడియా రిపోర్టర్లు వాస్తవాలను తెలుసుకొని వార్తలను రాయాలని కోరారు. ఆయన భార్య ఆరోగ్యం బాగా లేనందునే సెలవు పెట్టారనే వాస్తవ విషయాన్ని మీడియా ప్రతినిధులు అందరూ గమనించాలన్నారు.