అగ్నిపథ్ స్కీమ్ పై ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. బీహార్, మధ్యప్రదేశ్ తో పాటు హైదరాబాద్ లో నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లను తగలబెడుతున్నారు.
తాజాగా అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ భారతదేశ యువత దేశ రక్షణ రంగంలో చేరి సేవలు అందించేందుకు సుమర్ణావకాశం అని .. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ లేకపోవడంతో యువత ఆర్మీలో చేరలేకపోయిందని అయన అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ సూచనల మేరకు అగ్నివీరుల రిక్రూట్మెంట్ వయోపరిమితిని ఈసారి 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచిందని..ఈ ఒక్కసారికి సడలింపు ఉంటుందని.. అనేక మంది యువత అగ్నివీరులుగా మాడానికి అర్హులు అవుతారని వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో సైన్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుందని యువతకు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆర్మీ సన్నద్ధతను మొదలుపెడుతుందని ట్వీట్ లో వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. 4 ఏళ్ల తరువాత అగ్నివీర్ ఏం చేస్తాడో అంటున్న వారు జాగ్రత్తగా స్కీమ్ ను అర్థం చేసుకోవాలని అన్నారు. దయచేసి ఎవరూ మోసపోకండి, ప్రణాళిక అర్థం చేసుకోవాలని సూచించారు. ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం అని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ పథకం ద్వారా ఎక్కువ మంది ఆర్మీలో చేరే అవకాశం ఉందని.. ఆ తరువాత బీఎస్ఎఫ్, పోలీస్ ఇలా వేరే సేవల్లో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతో పాటు 23 ఏళ్లలోనే యువత రూ. 12 లక్షల వరకు సంపాదిస్తుందని వెల్లడించారు. భారతీయ ఆర్మీ, ప్రధాని మోదీపై విశ్వాసం ఉంచాలని ఆయన అన్నారు.