హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి జనాలు అతలాకుతలం అవుతున్నారు. గత 24 గంటల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారు. తాజాగా.. సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. వర్షాల దాటికి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంలోకి దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోగా.. ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగుర్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Himachal Floods: వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఏడుగురు.. వీడియో షేర్ చేసిన సీఎం
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా.. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో ఆ ప్రభావం అలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాల ధాటికి 257 మంది మృతి చెందారు. 32 మంది తప్పిపోగా.. 290 మంది గాయపడ్డారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి.. సిమ్లాలో శివ మందిర్ నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం వెళ్లిన భక్తులు.. మందిరం కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సీఎం తెలిపారు.
Pawan Kalyan: విసన్నపేట భూములపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తాం.. ఏంటి ఈ దోపిడి..?
ఇటు ఉత్తరాఖండ్‌లోనూ వానలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల రహదారులు నీటమునిగాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాదల్ నది ప్రవాహాంలో డెహ్రాడూన్‌లోని మాల్దేవత ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ కాలేజ్ కూలిపోయింది. కాగా.. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. 17 మంది తప్పిపోయారు. మరోవైపు భారీ వర్షాల దాటికి తెహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రిషికేష్- చంభా జాతీయ రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. రిషికేష్- దేవప్రయాగ జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపివేశారు.