ఈసారి అమేథీలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారంటూ దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపింది. రాహుల్ గాంధీనే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. తీరా.. కాంగ్రెస్ తొలి జాబితా వెలువడగానే ఆ ఉత్కంఠ వీడిపోయింది. రాహుల్ తిరిగి వయనాడ్ నుంచే బరిలోకి దిగారు. దీంతో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేసేదెవరంటూ తీవ్ర చర్చ సాగింది. మొత్తానికి ఆ ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదింపుతున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేశారు. అనూహ్యంగా స్మృతి ఇరానీ విజయం సాధించారు. 2024లో కూడా మరోసారి ఇద్దరూ తలపడతారని అంతా భావించారు. కానీ రాహుల్ మాత్రం కేరళలోని వయనాడ్ నుంచే తిరిగి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడినే రాహుల్ విక్టరీ సాధించారు. ఇక స్మృతి ఇరానీ అయితే అమేథీలోనే ఇల్లును నిర్మించుకున్నారు. మళ్లీ అమేథీ నుంచే పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. మొత్తానికి ఈ స్థానం నుంచి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్మృతి ఇరానీని ఎదుర్కోవాలంటే రాబర్ట్ వాద్రానే కరెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తనను అమేథీ నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని రాబర్ట్ వాద్రా తాజాగా వ్యాఖ్యానించారు. ఓ మీడియా ఛానల్‌తో వాద్రా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ కాంగ్రెస్ మాత్రం వాద్రా వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది. రాబర్ట్ పేరు పరిశీలనలో లేదని పేర్కొంది.
సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని భావించారు. కానీ రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇదిలా ఉంటే శుక్రవారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ రెండు స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమేథీ ప్రజలు తనను కోరుకుంటున్నారని రాబర్ట్ వాద్రా తాజాగా ప్రకటన చేశారు. మరీ కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వాద్రాను రంగంలోకి దింపితే మాత్రం అమేథీలో గట్టి పోటీ నెలకొననుంది.
ఇది కూడా చదవండి: Taiwan Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టి, యజమానిని కాపాడిన కుక్క.. వైరల్ వీడియో..
ఇక రాహుల్ గాంధీ 2004లో అమేథీ నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. అటు తర్వాత 2009, 2014లో తిరిగి ఇదే స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం 55,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. వయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గట్టెక్కారు.
ఇది కూడా చదవండి: Adah Sharma : ఆదా శర్మ కట్టిన ఈ సింపుల్ శారీ ధర ఎంతో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అటు తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.