వరంగల్ కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, అధికారులు ఆంక్షలు విధించినా.. ర్యాగింగ్ కొనసాగుతోంది. జాతీయ కోటాలో సీటు సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థిని.. తృతీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, బట్టలూడదీసి ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది.బాధిత విద్యార్థి.. సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయాన్ని, రాజస్థాన్‌లో ఉన్న తమ కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు వైద్యకళాశాలకు వచ్చి, ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో మాట్లాడారు.
మరోవైపు.. రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. డీఎంఈ రమేశ్ రెడ్డి వరంగల్ కేఎంసీకి వచ్చి ర్యాగింగ్ పై ఆరా తీసినట్లు తెలిసింది . అయితే ఫుట్ బాల్ ఆటలో జూనియర్లు , సీనియర్ల మధ్య చిన్న వివాదం జరిగిందని, ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్.. అయితే రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండడంతో.. వారి కుటుంబసభ్యులు చూసి వెళ్లారని వైద్యకళాశాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ అంశం సద్దుమణిగిందంటున్నారు.