ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ మూవీ మన మనసుకు, నమ్మకానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పాడు. ఇది జరిగిపోయిన స్టోరీ కాదు.. జరగబోయే స్టోరీ కాదు… ఎప్పుడూ నడుస్తున్న స్టోరీనే అని… అన్ని వయసుల వారికి ఈ మూవీ నచ్చుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా గురించి తాను చాలా రీసెర్చ్ చేశానని.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలోని పలువురు జ్యోతిష్యులను కలిశానని.. అందులో ఒక జ్యోతిష్యుడు ఈ సినిమా 2022 జనవరిలో విడుదలవుతుందని నాలుగేళ్ల క్రితమే చెప్పారని దర్శకుడు వివరించాడు. హీరోయిన్ పూజాహెగ్డే ఈ మూవీలో డాక్టర్ పాత్రలో కనిపిస్తుందన్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా రావడం లేట్ అయిందని దర్శకుడు రాధాకృష్ణకుమార్ పేర్కొన్నాడు. లవ్ అర్థమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని తెలిపాడు. ప్రభాస్ ఈ సినిమా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ సినిమాపై నమ్మకంతోనే కృష్ణంరాజు గారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారని వివరించాడు. వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఓ ప్రశ్నకు సమాధానంగానే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తారనే విషయం నిర్మాతలకే తెలుసు అని… తనకు టెక్నికల్ విషయాల గురించి పెద్దగా ఐడియా లేదని దర్శకుడు చెప్పాడు. కరోనా కారణంగా ఈ సినిమాకు చెందిన 150 మంది ఇటలీలో ఎలాంటి వర్క్ లేకుండా చిక్కుకుపోయామని.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికే భయంగా ఉందన్నాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పాడు. ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ వర్క్ 12 దేశాల్లో చేశామని రాధాకృష్ణ వెల్లడించాడు. ఫిలాసఫీ అనే నేపథ్యంగా తీసిన ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందన్నాడు.