ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పని చేస్తోంది. ఇందులో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి రేషన్ షాప్ వద్ద ‘క్యూఆర్ కోడ్’ పోస్టర్లను ఏర్పాటు చేసింది. రేషన్ కార్డు దారులు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియచేయవచ్చు. అభిప్రాయాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన స్పందనలు నేరుగా ఉన్నతాధికారులకు చేరుతాయి. అప్పుడు డీలర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.
‘క్యూఆర్ కోడ్’ పోస్టర్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ‘రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పని చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి రేషన్ డిపో వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేశాం. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. పలు ప్రశ్నలకు ‘అవును / కాదు’ అని సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటుంది. పౌరుల నుంచి వచ్చిన స్పందనలు నేరుగా ఉన్నతాధికారులకు చేరి.. అవసరమైనచోట్ల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ద్వారా సేవల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేశాం. ఇంటింటా రేషన్ పేరిట మొబైల్ యూనిట్లతో పంపిణీ కన్నా.. ప్రస్తుతం డిపోల వ్యవస్థలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నేటి నుంచి 65 ఎల్లా పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం 5 రోజుల ముందే ఇంటికే రేషన్ సరఫరా చేసే విధానం ప్రారంభించాం. జులై రేషన్‌ను జూన్ 26వ తేదీ నుంచే పంపిణీకి చేస్తున్నాం. ప్రజల అభిప్రాయాలే మార్గదర్శకంగా మారే ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి’ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
క్యూఆర్ కోడ్ ఫారమ్‌లో ప్రశ్నలు ఇలా:
# ఈ నెల రేషన్ తీసుకున్నారా?
# సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా?
# సరైన తూకంతో సరఫరా చేశారా?
# డీలర్ మర్యాదగా వ్యవహరించాడా?
# ఎటువంటి అధిక ధరలు వసూలు చేశారా?