Kota Srinivasa Rao Tribute Meeting in Vijayawada: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞశాలి అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశంసించారు. బీజేపీ సిద్ధాంతాలని చాటి చెప్పి.. పాటించిన వ్యక్తి అని పేర్కొన్నారు. కొన్ని సినిమాల్లో హిందుత్వాన్ని తప్పుగా చూపిస్తే ప్రతి ఘటించారనని చెప్పారు. తెలుగు వారిని, తెలుగు సినిమా కాపాడడానికి కోట ఎప్పుడూ ముందు ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పుకొచ్చారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావుకి హోటల్ ఐలాపురంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పీవీఎన్ మాధవ్ సహా హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్, సామినేని ఉదయభాను, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాబు మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటా చిత్రపటానికి నివాళులు అర్పించారు.
సంతాప సభలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ… ‘కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞశాలి. బీజేపీ సిద్ధాంతాలని చాటి చెప్పి పాటించిన వ్యక్తి. తెలుగు వారిని, తెలుగు సినిమా కాపాడడానికి ఆయన ఎప్పుడూ ముందు ఉన్నారు. విజయవాడ తూర్పు శాసన సభ్యుడుగా పని చేశారు. కొన్ని సినిమాల్లో హిందుత్వాన్ని తప్పుగా చూపిస్తే ప్రతిఘటించారు. తాను నమ్ముకున్న కలమా తల్లిని, చలన చిత్ర రంగాన్ని ముందుకు తీసుకొని వెళ్లిన వ్యక్తి ఆయన. హాస్యం పండించడంలో శిఖరాలని అధిరోహించారు. చిరంజీవి గారు, కోట గారు ఒకే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ప్రార్ధించారు. కోట ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.