ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi).. అచ్చం వాళ్ల నాయనమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంటారు. ఆమెను చూసిన కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇందిరానే ఊహించుకుంటారు. ఇకపోతే ప్రియాంక ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి.
ఇకపోతే సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం జరిగారు. ఈసారి పోటీ చేయట్లేదని రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగమైన లేఖను రాశారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలోకి దిగుతున్నారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు షికార్లు చేశాయి. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
రాయ్‌బరేలీ లోక్‌సభ (Raebareli) నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఫిరోజ్ గాంధీ.. అటు తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. సోనియాగాంధీకి (Sonia Gandhi) తిరుగులేని నియోజకవర్గం. ఇక్కడ నుంచి ప్రియాంక పోటీ చేస్తే విజయానికి తిరుగుండదని హైకమాండ్ అంచనా వేస్తోంది. కానీ ప్రియాంక మాత్రం రాయ్‌బరేలీ నుంచి కాకుండా మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.
ప్రియాంక.. సార్వత్రిక ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఎదుర్కోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె రాయ్‌బరేలీ నుంచి కాకుండా వారణాసి నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. గత రెండు పర్యాయాయాలు ప్రధాని మోడీ వారణాసి (Varanasi) నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ప్రియాంక కూడా అదే నియోజకవర్గంపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. వారణాసి నుంచి పోటీ చేసి గెలవాలని ఆమె కోరుకుంటున్నట్లు సమచారం.
ఇక రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పోటీ చేయొచ్చని సమాచారం. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. స్మృతిఇరానీ చేతిలో రాహుల్ ఓటమి చవిచూశారు. కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గెలుపొందడంతో గట్టెక్కగలిగారు. లేదంటే ఘోర పరాజయం మూటగట్టుకోవల్సి వచ్చేది. అందుకే ఈసారి రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తే సునాయసంగా గెలుపొంద వచ్చని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ భావోద్వేగమైన లేఖ రాశారు. 77 ఏళ్ల వయసు రీత్యా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నియోజకవర్గాల ప్రజలకు లేఖ రాశారు. తనను ఆదరించినట్లుగానే కుటుంబ సభ్యుల్ని కూడా ఆదరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఒక వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకోవైపు ఇండియా కూటమి ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. మరీ వచ్చే ఎన్నికల్లో ఏ కూటమి అధికారంలోకి వస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.