టీమ్‌ఇండియా క్రికెటర్ పృథ్వీ షాపై జరిగిన దాడి కేసులో నిందితురాలు సప్నా గిల్‌ను కస్టడీకి ఇస్తూ ముంబై మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా యూట్యూబర్ అయిన సప్నా గిల్ తరఫున న్యాయవాది కోర్టులో పృథ్వీ షాకు సంబంధించిన పలు విషయాలను లేవనెత్తినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. మద్యం తాగే అలవాటు ఉన్న షాను బీసీసీఐ గతంలో బ్యాన్ చేసిందని కోర్టుకు తెలిపారు. “కేసు పెట్టకుండా ఉండటానికి రూ.50 వేలు ఇవ్వాలని సప్నా గిల్ అస్సలు అనలేదు. దీనికి ఎలాంటి ఆధారం కూడా లేదు. సంఘటన జరిగిన 15 గంటల తర్వాత తన స్నేహితుడితో పృథ్వీ షా ఫిర్యాదు చేయించాడు. అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు?” అని సప్నా గిల్ లాయర్ వాదించారు.
Also Read: Virat Kohli: కోహ్లీ ఔటా! నాటౌటా?.. చెత్త అంపైరింగ్‌పై నెటిజన్ల ట్రోల్స్
విచారణ సందర్భంగా సప్నా గిల్ కూడా కోర్టుకు విన్నవిస్తూ.. అసలు పృథ్వీ షా అంటే ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నట్లు సమాచారం. “నా స్నేహితుడు అతడిని సెల్ఫీ అడిగాడు. అప్పటికీ అతడొక క్రికెటర్ అని నాకు తెలియదు. మేం కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. పృథ్వీ మాత్రం ఎనిమిది మందితో ఉన్నాడు. అతడు భోజనం కోసం వచ్చాడని చెప్పడం.. మేం క్లబ్‌లో పార్టీ చేసుకోవడమంతా అబద్దం. అప్పుడు అతడు మద్యం తాగి ఉన్నాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మమ్మల్ని అడిగారు” అని సప్నా కోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది. వాదనలు విన్న మెజిస్ట్రేట్ నిందితురాలు సప్నా గిల్‌ను ఫిబ్రవరి 20వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం సప్నా న్యాయవాది విలేకర్లతో మాట్లాడుతూ.. పృథ్వీ షా చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, తమ వాదనను కోర్టులో వినిపించినట్లు తెలిపింది.
Also Read: Cheteshwar Pujara: వందో టెస్టులో పుజారా చెత్త రికార్డు.. రెండో బ్యాటర్‌గా!