Site icon NTV Telugu

Prakash Reddy: ముఖ్యమంత్రిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విమర్శలు

Prakash Reddy

Prakash Reddy

Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు ఐదుగురిని మాత్రమే సిఫారసు చేయగా, తెలంగాణ నుంచి 300 మందికి పైగా పేర్లు సిఫారసు చేయబడ్డాయన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి, “మీరు సిఫారసు చేసిన ఐదుగురే అర్హులా? మిగతా మూడు వందల మందిని అర్హులుగా పరిగణించరా?” అని ఆయన ప్రశ్నించారు.

Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..

మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం సీఎం రేవంత్ రెడ్డికి జీర్ణించుకోవడం లేదని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అలాగే, గద్దర్‌ను గౌరవిస్తామని, ఈ విషయం పట్ల సీఎం నిష్పక్షపాతంగా ఉండాలని హితవు పలికారు. పద్మ అవార్డులను గౌరవించకుండా రాజకీయాలకు వాడడం సరికాదని సూచించారు. “రేవంత్ రెడ్డి తన పూర్వ కాంగ్రెస్ నాయకత్వం నుంచి నికృష్టమైన రాజకీయాలు నేర్చుకున్నారు. నెహ్రూ కుటుంబానికి కుశలమంటూ, గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారు” అని తెలిపారు. విద్యా వ్యవస్థలో నక్సలిజం భావజాలం చొప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అకునూరి మురళీ, హరగోపాల్, రమా మేల్కోటేలను మాత్రమే విద్యా వ్యవస్థకు అర్హులుగా చూడడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.

గాంధీ కుటుంబం, గాడ్సే కుటుంబం గురించి దేశ ప్రజలకు స్పష్టత ఉందని ప్రకాష్ రెడ్డి అన్నారు. మహమ్మద్ గజనీతో ప్రధాని మోడీని పోల్చడం రేవంత్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనమని చెప్పారు. ప్రకాష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీజేపీ నాయకుల స్పందనలు, ఆవార్డులపై వివాదాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

Exit mobile version