Raja Saab: సంక్రాంతి బరిలో పందెం కోళ్ల విన్యాసాలు మామూలే.. కానీ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక ‘డైనోసార్’ గర్జించబోతోందని ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతున్న సమయంలో స్టేజ్‌పైనే ఉన్న నిర్మాత విశ్వప్రసాద్ కంట్లో కన్నీళ్లు కనిపించాయి. ఒక నిర్మాత సినిమా గురించి ఎంత స్ట్రగుల్ పడితే అలా కంట్లో కన్నీళ్లు కనిపిస్తాయో అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికలలో కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: Director Maruthi: ఇక నేను మాట్లాడాను.. నా పని మాట్లాడుతుంది..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విడుదల కాకముందే ట్రెండింగ్ యాప్స్‌లో ‘రాజా సాబ్’ హవా మొదలైందని పేర్కొన్నారు. బుకింగ్స్ జోరు చూస్తుంటే ఇది కేవలం సినిమా ఓపెనింగ్ మాత్రమే కాదు, ఒక ‘మైండ్ బెండింగ్’ ప్రభంజనం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ప్రభాస్ పడ్డ కష్టం, తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. దర్శకుడు మారుతి ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవరూ చూపించని సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారని తెలిపారు. “ఈ సినిమా కోసం మారుతి ఎన్ని రాత్రులు నిద్రలేకుండా ల్యాబ్‌లోనే గడిపారో నాకు తెలుసు” అంటూ తన స్నేహితుడి కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక సంగీత దర్శకుడు తమన్ గురించి చెబుతూ.. రేపు థియేటర్లలో ‘తమన్ తాండవం’ చూస్తారని, పది మంది ఉన్న గదిలోనే మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ వచ్చాయని, రేపు థియేటర్లలో ప్రేక్షకుల పరిస్థితి ఊహించుకోవచ్చని ఆయన అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ సేవా దృక్పథాన్ని ఎస్‌కేఎన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ సొంత సినిమాలు (మిరాయి వంటివి) థియేటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, ఇతర పెద్ద సినిమాలు (ఓజీ వంటివి) విడుదలవుతున్నప్పుడు థియేటర్లను అడ్జస్ట్ చేయడంలో ఆయన చూపిన చొరవ గొప్పదని అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ ఈ సినిమాకు థియేటర్ల విషయంలో సహకరిస్తారని, అలా సహకరించిన వారందరి పేర్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని చెప్పారు. తనకు ఒక థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటానని, అదే తనకు థియేటర్ ఇవ్వకపోతే 200 సార్లు చెబుతానని, ఇది తన నైజం అని వెల్లడించారు. “ప్రభాస్ గారు చెప్పినట్లు అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి” అనే సిద్ధాంతంతో ఈ సంక్రాంతికి వస్తున్న చిరంజీవి, వెంకటేష్, రవితేజ, శర్వానంద్ వంటి హీరోల సినిమాలన్నీ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. చివరగా ఆయన అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. “ప్రతి సంక్రాంతికి పందెం కోళ్ల మీద బెట్టింగ్ వేస్తారు, కానీ ఈ సంక్రాంతికి పందెం ‘డైనోసార్’ (ప్రభాస్) మీద.. ఆయన బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ ఇవ్వబోతున్నారు” అని చెప్పారు.
READ ALSO: Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ..