Post Office Senior Citizen Saving Scheme: పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన అంశం. ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఈ పథకం ద్వారా రిస్క్ లేకుండా అధిక వడ్డీతో నెలకు రూ.20,500 వరకు ఆదాయం పొందవచ్చు.
రిస్క్-రహిత పెట్టుబడి, ప్రభుత్వ భరోసా
పోస్టాఫీస్ పథకాలు అంటేనే భద్రతకు మారు పేరు. ఎందుకంటే వీటికి పూర్తిగా ప్రభుత్వ హామీ ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులు, షేర్ మార్కెట్ రిస్క్ లాంటి భయాలు ఏమాత్రం ఉండవు. అందుకే రిటైర్ అయిన వారు, సీనియర్ సిటిజన్లు ఈ పథకాలను ఎక్కువగా నమ్ముతారు. ఇక, ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై ప్రభుత్వం ఏటా 8.2 శాతం వడ్డీ అందిస్తోంది. ఇది చాలా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువే. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికంగా) నేరుగా ఖాతాలో జమ చేస్తారు.
రూ. 1000తోనే ప్రారంభం, పన్ను మినహాయింపు కూడా
ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు కనీస మొత్తం కేవలం రూ.1000 మాత్రమే. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అందువల్ల ఇది ఆదాయం + పన్ను ఆదా రెండింటినీ అందించే పథకంగా నిలుస్తోంది.
ఈ స్కీమ్‌కి అర్హులు ఎవరు?
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్‌కు అర్హులు.. భార్యాభర్తలతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవచ్చు.. VRS తీసుకున్నవారు: 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు.. రిటైర్ అయిన రక్షణ సిబ్బంది.. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.. అయితే, SCSS పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అవసరమైతే దీనిని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. అయితే మెచ్యూరిటీకి ముందే ఖాతా మూసివేస్తే, నిబంధనల ప్రకారం జరిమానా ఉంటుంది. ఖాతాదారుడు మరణిస్తే, ఖాతా మూసివేసి మొత్తం నామినీకి చెల్లిస్తారు.
నెలకు రూ.20,500 ఎలా వస్తుంది?
మీరు ఒక జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే.. వార్షిక వడ్డీ.. రూ.30,00,000 × 8.2% = రూ.2,46,000 వస్తాయి.. త్రైమాసిక వడ్డీ విషయానికి వస్తే.. రూ.2,46,000 ÷ 4 = రూ.61,500.. నెలవారీ ఆదాయం (సగటు) సుమారు రూ.20,500.. ఈ వడ్డీ రేటు మీరు ఖాతా తెరిచిన సమయంలో ఫిక్స్ అవుతుంది. తర్వాత ప్రభుత్వం వడ్డీ రేట్లు మార్చినా, మీ మెచ్యూరిటీ వరకు అదే రేటు వర్తిస్తుంది. మొత్తంగా.. రిస్క్ లేకుండా, స్థిరమైన ఆదాయం కావాలనుకునే రిటైర్ అయినవారికి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నిజంగా ఒక సూపర్ స్కీమ్ అని చెప్పొచ్చు. వృద్ధాప్యాన్ని ఆర్థిక ఒత్తిడిలేకుండా ఆనందంగా గడపాలనుకునే వారికి ఇది ఉత్తమ పెట్టుబడి మార్గం.