కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పది వేల లోపే బీజేపీకి ఓట్లు వస్తాయని పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడలో ప్రచారంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం పాల్గొన్నారు.
ఎన్టీవీతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ… ‘మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు మావైపు ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి అందించిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున సానుకూలంగా ఉన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అభివృద్ధి చేయించుకుంటున్నారో.. ఇక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పెన్షన్లు ఇచ్చిన నిధులను కూడా లెక్క చెబితే.. అది అభివృద్ధి అవుతుందా?. అభివృద్ధి చేయడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ చేయడం. ఈ రెండు నెలల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 2500 కోట్ల అభివృద్ధి పనులను చేశాము’ అని అన్నారు.
Also Read: Wine Shops Close: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు షాప్స్ క్లోజ్!
‘దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఇక మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సమస్యలను రిప్రెంటేషన్ చేయడంలో విఫలమయ్యాడు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కిషన్ రెడ్డికి సహకరించింది. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్ఎస్కు తాకట్టు పెట్టాడు. మీ ప్రచారం సరళి చూసిన ప్రజలు మీ సొంత ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీకి లొంగిపోయారని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో మీ ఓటు ఎటు వేసిన సరే అనే ప్రవర్తన కనిపిస్తుందని ప్రజలే అంటున్నారు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా మీ పార్లమెంట్ పరిధిలోకే వస్తది. మరి నా చాలెంజ్ కు కిషన్ రెడ్డి సిద్ధమా?. ప్రజల స్పందన చూస్తే కచ్చితంగా మెజారిటీతోనే జూబ్లీహిల్స్ గెలవబోతున్నాం’ అని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.