గత నెల 27న వినాయక విగ్రహాల తయారీ వద్ద నుంచి కొందరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా దొంగతనంగా ఓ ట్రాలీ వాహనంలో వినాయకుడి విగ్రహం పట్టుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని చంద్ర భవన్ కాంప్లెక్స్ లో జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం తో విగ్రహం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో సురేష్ ప్రతియేట గణనాధుల విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. మరికొన్ని రోజుల్లో గణేష్ చతుర్థి రానుండడంతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు అర్ధరాత్రి వేళ ట్రాలీలో గణేష్ విగ్రహాన్ని చోరీ చేసి తీసుకెళ్లారు.
తెల్లారి అక్కడికి చేరుకున్న యజమాని విగ్రహం చోరీకి గురైన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన వినాయక విగ్రహ కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి బ్యాచ్ మత్తులో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నలుగురు నిందితులపై గతంలో కేసులు ఉన్నట్టు గుర్తించారు. షాపు ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులను రిమాండ్ కి తరలించి ట్రాలీ ఆటో, వినాయక విగ్రహాన్ని కోర్టుకు తరలించారు పోలీసులు.