PM Modi: ఎన్డీయే ప్రభుత్వ తొలి లక్ష్యమే పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నానన్న ప్రధాని మోడీ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. సికింద్రబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సభకు హాజరు కావడం.. తన కుటుంబ సభ్యులతో గడిపినంత ఆనందంగా ఉందన్నారు. మందకృష్ణ తన చిన్నతమ్ముడిలాంటివాడని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయని.. సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీ మాత్రమేనన్నారు.
Also Read: CM YS Jagan: దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీక.. దీపావళి
సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అనేది తన విధానమన్న ప్రధాని మోడీ.. సామాజిక న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు ప్రధాని మోడీ. పేదరిక నిర్మూలనే ప్రథమ ప్రాధాన్యం అన్నారు. బాధలు పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయన్న ప్రధాని మోడీ.. మాదిగలు వన్‌లైఫ్, వన్ మిషన్‌లో పోరాటం చేశారన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోందని ప్రధాని అన్నారు. దళిత నేతను సీఎం చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని.. ప్రస్తుం తెలంగాణ సంకట పరిస్థితిలో ఉందన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేకపోయిందన్నారు ప్రధాని మోడీ. దళితుల ఆశలపై నీళ్లు చల్లింది కేసీఆరేనని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని.. ఇవ్వలేదని ఆయన చెప్పారు.
Also Read: Gajwel Constituency: గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నమోదైన నామినేషన్లు
దళితబంధు పథకం వల్ల బీఆర్‌ఎస్ నేతలకే మేలు జరిగిందన్నారు ప్రధాని మోడీ. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. మాదిగ విరోధులు అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో చిత్రపటం కూడా పెట్టలేదన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని పేర్కొన్నారు. మేం వచ్చాకే అంబేడ్కర్ ఫోటో పెట్టామని, భారతరత్న ఇచ్చామని స్పష్టం చేశారు. దళిత వ్యక్తి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ప్రధాని ఆరోపించారు. దళిత బిడ్డ రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ప్రధాని విమర్శలు గుప్పించారు. దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ కాంగ్రెస్ అనేక రకాలుగా వేధించిందన్నారు.