ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు.
ప్రధాని మోడీ, జో బైడెన్‌లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు జరిపారు. మార్చిలో క్వాడ్ సమ్మిట్ గురించి, ఏప్రిల్‌లో వాతావరణ మార్పులపై, జూన్‌లో జీ-7 సదస్సుపై చర్చించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్న సమయంలో…మోడీ, బైడెన్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా పర్యటన ఖరారైతే…మోడీ పలువురు నేతలను కలిసే అవకాశాలు ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ హయాంలో…2019 సెప్టెంబరులో అమెరికాలో పర్యటించారు ప్రధాని. సెప్టెంబరు 22న హౌస్టన్‌లో జరిగిన మోడీ హౌడీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత…మరోసారి యుఎస్ టూర్‌కు వెళ్లనున్నారు మోడీ.