కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్ డీజిల్‌పై 16 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.66కి చేరింది. అటు లీటర్ డీజిల్ రూ.105.65కి ఎగబాకింది.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. లీటరు పెట్రోల్ ధర రూ.105.41 వద్ద, లీటరు డీజిల్ ధర రూ.96.67 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 109 డాలర్లుగా నమోదైంది. డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 107.4 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా చమురు రేట్ల పెంపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.