Perni Nani Challenge: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు దుమ్ముంటే 2014 నుంచి 2019 వరకు తాను చేసిన పాలనను తిరిగి తీసుకుని వస్తానని చెప్పాలన్నారు.. మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పగలవా? అమరావతి పేరుతో దోచుకున్నది ఎవరు? ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే… ఎత్తేసింది చంద్రబాబు కాదా? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మరణానికి కారణం అయిన వ్యక్తి సైకో కాదా? బావ ఆనందం కోసం తండ్రినే మోసగించిన బావమరుదులను తడి గుడ్డతో గొంతు కోసిన వాడిని సైకో అనరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నమ్మి ఓటేసిన ప్రజలను అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచిన వాడు సైకో కాదా? అని ప్రశ్నించిన పేర్నినాని.. నా మీద తప్పుడు ఆరోపణలు చేశాడు.. నా మీద చేసిన ఆరోపణల పై చర్చకు సిద్ధమా చంద్రబాబు? అంటూ సవాల్ చేశారు.. కొల్లు రవీంద్ర రాసి ఇస్తే చదివే దౌర్భాగ్యం చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నేను ఒక్క రూపాయి అయినా అక్రమంగా తిన్నాను అని నిరూపిస్తే నాకు ఓటేసిన నియోజకవర్గ ప్రజల మల మూత్రాలు తిన్నట్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, బందరు సభకు జనాలు రాకపోవటంతో చంద్రబాబు షాక్ కు గురయ్యారన్న ఆయన.. క్యాడర్ కూడా ఆయన్ని వదిలేసినట్లు ఉన్నారు.. రెండు వేల కుర్చీలు వేసినా… నిండలేదు.. ఖాళీ కుర్చీలకు గంటా 40 నిమిషాలు ప్రసంగించిన ఘనత చంద్రబాబుదే నని సెటైర్లు వేశారు.
బందర్‌కు వచ్చే నైతిక అర్హత చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు పేర్నినాని.. ఐదేళ్ళు అధికారంలో ఉండి బందరుకు ఏం చేశావు? అని ప్రశ్నించారు. 2014 ఏప్రిల్ 18న ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బందరు పోర్టు కడతాను అన్నాడు.. బందరుకు ఐటీ పరిశ్రమ, ఔటర్ రింగ్ రోడ్డు, పోర్ట్ సిటీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, 50 వేల ఇళ్ళు, మూడు సెంట్ల భూమి వంటి ఎన్నో హామీలు ఇచ్చారు.. వీటిలో ఒక్కటైనా చేశావా ? అంటూ మండిపడ్డారు.. ఇంతకంటే పచ్చి దగా ఇంకోటి ఉంటుందా? అని ఫైర్ అయ్యారు. అయితే, బందరు పోర్టును మే రెండు, మూడో వారంలో ప్రారంభం అవుతుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని ప్రకటించారు.. పులివెందులలో బస్టాండ్ కూడా కట్టలేదని చంద్రబాబు అబద్దాలు చెప్పాడు.. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మకానికి జగన్ మారుపేరు.. వెన్నుపోటుకు, నమ్మక ద్రోహానికి చంద్రబాబు మారుపేరు అని వ్యాఖ్యానించారు.. ఒక్క ఎకరం కూడా భూ సేకరణ చేయకుండా జగన్ బందరు పోర్టు నిర్మిస్తున్నారని తెలిపారు.. కానీ, చంద్రబాబు పోర్టు పేరుతో 33 వేల ఎకరాల భూమి సేకరించాడని.. మేం కేవలం పోర్ట్ రహదారి కోసం మాత్రమే భూసేకరణ చేస్తున్నామని వివరించారు మాజీ మంత్రి పేర్నినాని.