రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ పూర్తయింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధను 2 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో ఆమె సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. విచారణలో పోలీసులు 45 ప్రశ్నలు అడిగారు. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె చెప్పింది. మానస తేజ మీద నమ్మకంగా అంతా గోడౌన్ నిర్వహణ అతనికి అప్పగించినట్లు తెలిపింది. గోడౌన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి తేజ విధుల్లో ఉన్నాడని పేర్కొంది. చాలా ప్రశ్నలకు సమాధానంగా తనకు తెలియదని జయసుధ చెప్పినట్టు సమాచారం. నిజంగా తెలిసి చెప్పలేదా? లేక నిజంగానే ఆమెకి తెలియదా? అనే విషయాలను వేరే నిందితులతో కలిసి పోలీసులు బేరీజు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. విచారణ సమయంలో స్పైనల్ కార్డ్ నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు జయసుధ తెలిపింది.
READ MORE: AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటికి ఆమోదం తెలపనున్న ప్రభుత్వం..
ఇదిలా ఉండగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యంను పక్కదారి పట్టించారని వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. గోదాము మేనేజర్ బేతపూడి మానస్ తేజను ముందు పెట్టి ఈ కుట్ర అమలు చేశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు.