Gidugu Rudraraju: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పార్టీ ఏదైనా సరే ఈ సారి పోటీ చేసి తీరాలని భావిస్తోన్న కొందరు నేతలు.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ఏపీలో తిరిగి పుంజుకోవడానికి పావులు కదుపుతోన్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించే పనిలో పడిపోయింది.. విజయవాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడి గిడుగు రుద్రరాజు.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు.. కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను స్ధానాలను మారిస్తే, ఒకచోట చెల్లనిది మరోచోట ఎలా చెల్లుబాటు అవుతుంది? అని ప్రశ్నించారు. బలహీనవర్గాల నాయకులను తక్కువ చేయడానికే ఈ మార్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Read Also: Ram Mandir : రామ మందిర ప్రారంభోత్సవం.. ప్రమిదలకు భారీగా పెరిగిన డిమాండ్
ఇక, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల కు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని మండిపడ్డారు రుద్రరాజు.. టీడీపీ ఇద్దరితోనే నడుస్తోంది.. వైసీపీ కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగిందో తెలీదు.. అందరూ రండి కలిసి పనిచేద్దాం.. కాంగ్రెస్ నుంచి అందరికీ పిలుపునిచ్చారు. ఒంగోలులో యువభేరి నిర్వహించాం.. పాదయాత్ర, ర్యాలీ నిర్వహించామని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోయింది.. మత్తు పదార్ధాలు, గంజాయి అక్రమ రవాణా, సేద్యం మీద ఉక్కుపాదం మోపాల్సి ఉందన్నారు. 25 వేల కోట్ల రూపాయల మద్యం రాష్ట్రంలో అమ్ముడవుతోందన్నారు. పార్టీ నాయకుల మనోభావాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ తెలుసుకున్నారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మండలాధ్యక్షులను నియమించుకున్నాం.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.