Pawan Kalyan: పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన పవన్.. సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలని సూచించారు. ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే నా అంత బలంగా తిరగాలి. ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలి. సీఎం అనే పదవి రావాలంటే సముచిత స్థానంలో గెలిపించాలని పిలుపునిచ్చారు.. సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికలయ్యాక తేలుతుందన్న పవన్.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో చూసి ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఖరారు అవుతారని తెలిపారు.. సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు.. ఈ సీఎం ఉండకూడదనేదే ముఖ్యం అన్నారు.
ఆవేశంతో రాజకీయం చేయకూడదు.. టీడీపీ-బీజేపీలతో పొత్తుకు సిద్ధమనే ప్రకటించాం.. ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. పొత్తు ఖరారై.. విధి విధానాలు ఓకే అయితే కామన్ మినిమమ్ ప్రొగ్రాం సెట్ చేస్తాం అని తెలిపారు పవన్ కల్యాణ్.. జనం మధ్యనే కూర్చొని కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపొందిస్తామన్న ఆయన.. జనసేనలో ఉండేవాళ్లకే నేను బాధ్యతలు ఇస్తాను.. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయే వాళ్లకి నేను బాధ్యతలు ఇవ్వను అని స్పష్టం చేశారు.. పార్టీలో నాదెండ్లను చాలా మంది విమర్శిస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదని హితవుపలికారు.. పార్టీలో అనుకూల శత్రువులుగా మారొద్దు.. అనుకూల శత్రువులు ఎవరైనా ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మనోహర్ ఏ రోజూ నన్ను సంప్రదించకుండా ఏం మాట్లాడరన్న ఆయన.. నాదెండ్ల లాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ, తూలనాడొద్దు అన్నారు.. నేను అంటే పడి చచ్చిపోతామనే వాళ్లు.. నాదెండ్లను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లను నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తాను.. నా మీద కోపాన్ని నాదెండ్ల మీద చూపుతున్నారు.. ఏదైనా ఉంటే నా మీదే కోప్పడండి.. నన్నే విమర్శించాలని సూచించారు.
నేను సీఎం కావాలంటే.. నన్ను గౌరప్రదమైన స్థానంలో కూర్చొబెట్టాలి.. 48-50 శాతం ఓట్లు జనసేనకు ఇవ్వండి.. సీఎం సీటు అడుగుదాం అంటూ పొత్తులపై మరోసారి తేల్చేశారు పవన్.. టీడీపీ-బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసిన ఆయన.. కామన్ మినిమమ్ ప్రొగ్రాం ఖరారు చేసుకుంటామంటూ వెల్లడించారు.. ఎన్నికలయ్యాక.. బలబలాల ఆధారంగా సీఎం సీటు ఎవరికో తేలుతుందన్న పవన్. జనసేన ఓటింగ్ శాతం ఎంత మేర ఉందో ఈ సందర్భంగా వివరించారు.. అయితే, త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదన్నారు పవన్.. ఫ్యూడలిస్టిక్ సిద్ధాంతాలతో రాష్ట్రాన్ని వైసీపీ నలిపేస్తోంది. వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అని గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పాల్జేసింది, రాష్ట్రంలో గూండాయిజాన్ని పెంచి పోషించింది, రైతులు, నిరుద్యోగులను మోసం చేసింది అంటూ వైసీపీపై ఆరోపణలు గుప్పించారు.. ఇంత మోసం చేసిన ఆ పార్టీని ప్రత్యర్థిగా భావించాలా? టీడీపీనా? హెలికాప్టర్ వెళ్తుంటే పచ్చని చెట్లు కొట్టేస్తారా? ప్రజల్లో పచ్చదనాన్ని చంపేస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వైసీపీని గద్దె దించేయాల్సిందే నంటూ పిలుపునిచ్చారు.
2014లో నేను టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశాను. నా వల్ల కొందరు ఎమ్మెల్యేలు.. ఎంపీలు అయ్యారని తెలిపారు పవన్.. వైసీపీలో కొందరు సకల కళా కోవిదులున్నారని సెటైర్లు వేసిన ఆయన.. చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ.. క్యూట్ క్యూట్ గా నన్ను విమర్శించేందుకు కొందరు నేతలు వస్తారు కదా..? వాళ్లని సీఎం అభ్యర్థులుగా ప్రకటించండి అంటూ సలహా ఇచ్చారు. మేం చేయలేమని వైసీపీ భావిస్తే.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు..? టీడీపీనైనా పట్టించుకోవడం లేదు కానీ.. మమ్మల్ని మాత్రం వదలడం లేదు. వైసీపీకి మేమంటే భయం అందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారని తెలిపారు. డిసెంబరులో ఎన్నికలు పెడతారు.. జూన్ నుంచి ప్రజల్లో తిరుగుతానని పేర్కొన్నారు పవన్. సీఎం అభ్యర్థిత్వానికి ఒప్పుకోకుంటే పొత్తు వద్దంటూ సలహాలు ఇస్తున్నారు.. గతంలో నాకెందుకు సపోర్ట్ చేయలేదు..? అని ప్రశ్నించారు. సలహాలిచ్చేవాళ్లంతా నా కోసం భీమవరంలో ఎందుకు ప్రచారం చేయలేదు. సలహాలిచ్చేవాళ్లెవరూ నాతో లేరు.. కార్యకర్తలే నాతో ఉన్నారని తెలిపారు.
వ్యూహం మాది.. బాధ్యత మీది.. వ్యూహాల సంగతి మాకు వదిలిపెట్టండి.. బాధ్యతతో పని చేయండి అని సూచించారు పవన్.. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో రాజకీయం చేస్తోందంటే కారణం పొత్తులేనన్నారు.. పొత్తులతోనే పార్టీ బలోపేతం అవుతుంది. చంద్రబాబు మనల్ని మోసం చేస్తే మోసపోతామా..? సలహాలిచ్చే కాపు నేతలు కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ను ఎందుకు నిలదీయరు..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కాపుల గురించి మాట్లాడే వారు.. ఇతర కులాలకు చెందిన వాళ్లనే పెళ్లిళ్లు చేసుకున్నారు. రాజకీయాల్లో మాత్రమే కాపుల గురించి మాట్లాడే కాపు నేతలు హిపోక్రట్లు అని కామెంట్ చేశారు. జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ఓటింగ్ మనకు ఉంది. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25 శాతం ఓటింగ్ ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో 35 శాతం ఓటింగ్ ఉందని.. ఈ ఓటింగుతో సీఎం కావడం సాధ్యమా..? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.