ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని పవన్ కోరారు.
ఈ దాడికి పాల్పడిన వారు వైసీపీ వర్గీయులని చెబుతున్నారని.. అదే నిజం అయితే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నామని.. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పవన్ వ్యాఖ్యానించారు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. అంతా క్షేమంగా, ధైర్యంగా ఉండాలన్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసేటప్పుడు నియంత్రణ పాటించాలని హితవు పలికారు. విమర్శ హర్షించే విధంగా ఉండాలి తప్ప… ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉండకూడదని పవన్ పేర్కొన్నారు.