ఒకవైపు హైకోర్ట్ జరిమానాలు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇప్పటం గ్రామం ఇంకోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్లకు సంబంధించి బాధితులకు పవన్ ఇంతకుముందే పరిహారం ప్రకటించారు. ఈనెల 27న జరిగే పర్యటనలో వారికి ఒక్కొక్కరికి లక్షరూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. గతంలో ఇప్పటం పర్యటనకు పోలీసులు తొలుత పర్మిషన్ ఇవ్వలేదు..అయితే ససేమిరా అంటూ వాహనంపైకి ఎక్కి టాప్ పైన కూర్చుని పవన్ ఇప్పటంలో పర్యటించారు. మరోసారి పవన్ పర్యటన హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికై నిలిచిన గ్రామం ఇప్పటం. ఆ గ్రామ రైతులు పార్టీ కార్యక్రమ సభా ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారు. రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారు. ఇప్పుడు ఆ గ్రామస్తులను కలిసి వారి బాధలను తెలుసుకొని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.లక్ష ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి విదితమే. ఆ ఆర్ధిక సాయాన్ని ఈ నెల 27వ తేదీన బాధితులకు అందించనున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్థిక సాయం చెక్కులు బాధితులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బాధితులు చెక్కులు అందుకుంటారు.. అని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 27వ తేదీన ఇప్పటం గ్రామానికి రానున్నారు. ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేయడంతో ఇప్పటం గ్రామంలో కొందరి ఇంటి ప్రహరీగోడలను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇళ్లు కోల్పోయిన ప్రతి ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ బాధితులకు లక్ష రూపాయల చెక్కును అందించనున్నారు. రోడ్డు వెడల్పు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు ఇళ్లను కూలుస్తున్నారు అన్న దానిపై ఇప్పటం గ్రామం వార్తలకు వేదికగా మారింది. ఎన్నికల కంటే ముందుగానే రాజకీయ నేతల పరామర్శలతో ఇప్పటం గ్రామం ఫుల్ బిజీగా మారింది. అయితే తమ పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ పవన్ గతంలోనే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు పవన్ ఇప్పటం గ్రామ ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా సాయం చేస్తానని ప్రకటించారు.
Read Also: Ponnavolu Sudhakar Reddy: కొలీజియం, సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తారా?
మరో వైపు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీకి నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తీరుపై నిరసన తెలియజేస్తూ.. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించడంతో మరింత రాజకీయ హీట్ పెరిగింది. అప్పట్లో ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం కోసం చేపట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం వివాదాస్పదం అయింది. ఇప్పటం వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో పవన్ వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం చేరుకోవాల్సి వచ్చింది. ఆసమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు, పవన్ వాహనశ్రేణికి తమ వాహనాలు అడ్డంగా ఉంచారు. పోలీసులు ఇప్పటం వెళ్లేందుకు అనుమతిలేదని చెప్పారు. దీంతో వాహనం దిగిన పవన్.. కాలినడకన ఇప్పటం బయలుదేరారు. సర్వీసు రోడ్డు నుంచి జాతీయరహదారిపైకి వచ్చి, పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటం వెళ్లి తీరతానని…కావాలంటే అరెస్టు చేసుకోవాలని పోలీసులకు పవన్ స్పష్టం చేశారు. దాదాపు కిలోమీటర్ మేర పవన్ కాలినడకన వెళ్లారు. ఆయన వెనుక జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆ పర్యటన సినిమా స్టైల్ సాగిందని చెప్పాలి.
పవన్ పర్యటన సమయంలో చేసేది లేక పోలీసులు పక్కకు తప్పుకున్నారు. తర్వాత వాహనంపైకి ఎక్కి టాప్ పైన కూర్చున్న పవన్ ఇప్పటం బయలుదేరారు. పవన్ వాహన శ్రేణి ఇప్పటానికి సమీపించగానే రైల్వే గేటు వేశారు. వాహనం దిగి పవన్ పొలాల్లోకివెళ్లారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో, రైల్వే గేటు తెరిచారు. వెంటనే పవన్ వాహనంలోకి ఎక్కి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాలను చూసి పవన్ చలించిపోయారు. రోడ్డుకు మధ్యలో ఉన్న వైఎస్ విగ్రహం అలాగే ఉంచి లోపల ఉన్న ఇళ్లను కూల్చివేశారని బాధితులు పవన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు.
ఇప్పటం గ్రామం జనసేన పార్టీకి అండగా నిలబడిందని, వారికి కష్టమొస్తే మేము మా ప్రాణాలకు తెగించి అయినా వారిని కాపాడుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో జనసేనకు తోడుగా నిలిచే వారిని ఎట్టి పరిస్థితిలో వదులుకోబోమన్నారు. కచ్చితంగా ఇప్పటం గ్రామస్తులకు చివరి వరకు తోడుంటామని, ఎన్ని కేసులు, మరెన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ పోరాటం ఆగదన్నారు. కచ్చితంగా ఇప్పటం గ్రామస్థుల తరఫున న్యాయపోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ నేతలు ఇదే విషయంపై గతంలోనే స్పందించారు. ఇళ్లు కూల్చివేతపై జనసేన, టీడీపీ రాజకీయ రచ్చ చేస్తున్నాయని వైసీపీ విమర్శించింది.
రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాల కోసమే ప్రహరీలు తొలగించినట్లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటోంది. గతం నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. వైఎస్ విగ్రహం దిమ్మె కూడా తొలగించామని.. ఇప్పటికే ప్రహరీలు తొలగించిన ఇళ్లను కూడా బాగు చేసుకున్నారని వైసీపీ నేతలు ఫోటోలతో స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపు పై హై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది కోర్టు. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి స్టే తెచ్చుకున్నారు పిటిషనర్లు. దీనిపై వైసీపీ నేతలు పవన్ పై విమర్శలు చేశారు.
Read ALso: Marri Shashidhar Reddy : బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి.. ‘తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది’