ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం రాజుకుందా? మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించడంతో ఇక అధికార పార్టీ దూకుడు మీద ఉందా? పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీచేయనున్నారు? గతంలో లాగా రెండుచోట్ల పోటీచేస్తారా? సేఫ్ ప్లేస్ లో పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెడతారా? టీడీపీతో పొత్తుతో ఈసారి పవన్ ఎమ్మెల్యే అవుతారా? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఏపీ మంత్రి అమర్నాథ్ పవన్ ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ 175నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే నేను అన్నీ వదులుకుని వెళ్లిపోతానన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడు ….అప్పుడు ఏమైంది….?.ఇప్పుడు అదే జరుగుతుంది…175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్పగలరా…? కనీసం పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పగలుగుతారా….? అని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. పోయిన చోటే వెతుక్కోవాలనే లాజిక్‌తో మళ్లీ ఆ రెండు స్థానాల్లోనే ఆయన పోటీ చేస్తారని కొందరు అంటుంటే.. ఒకచోట నుంచే పవన్ పోటీచేస్తారని అంటున్నారు. భీమవరం, గాజువాక కాదని వేరేచోట నుంచి పవన్ బరిలో దిగినా ఓటమి భయంతోనే నియోజకవర్గం మార్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన నేతలు భావిస్తున్నారు.ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నా ఓ నిర్ణయానికి అయితే వచ్చి ఉంటారని ఆయన అభిమానులు అంటున్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తామని అంటున్న వైసీపీ వాళ్లకే ముందు సమాచారం ఇస్తానని పవన్ కౌంటర్ ఇవ్వడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
ప్రస్తుతానికి ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, తిరుపతి ఉన్నాయని ప్రచారం గట్టిగా సాగుతోంది. కానీ, ఈ రెండింటికంటే పిఠాపురం అయితే బెస్ట్ అని జనసేన నేతలు చెబుతున్నారు. గతంలో తన అన్న మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, చిత్తూరు జిల్లా తిరుపతి రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశారు.
తన అత్తగారి ఊరు అయిన పాలకొల్లులో పరాజయం అయ్యారు. దీనిపై అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నారు చిరంజీవి. తిరుపతి నుండి పోటీచేసి గెలిచారు. ఈసారి పవన్ ఒక నియోజకవర్గమే ఎంచుకుని అక్కడే ఫోకస్ పెడతారని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేనను బలోపేతం చేయడంపై పవన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో వ్యవస్థాగత నిర్మాణం సహా సమస్యలపై పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు పవన్. ప్రతి నియోజకవర్గానికి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సమస్యలు.. అధికార పార్టీ నేతల వ్యవహరంపై వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని తీసుకోనుంది జనసేన. వాట్సాప్ గ్రూపుల పర్యవేక్షణకు త్వరలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది జనసేన.
Read Also:Manipal University : అలా అన్నందుకు స్టూడెంట్‌కు సారీ చెప్పిన ప్రొఫెసర్
ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న పవన్ బీజేపీ లేకుండానే తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సమాలోచనలు జరపుతున్నారు. పిఠాపురం నుంచి అయితే తనకు సేఫ్ అని పవన్ భావిస్తున్నారు. ఈమేరకు సర్వే కూడా పూర్తయిందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి భారీగా 28 వేల ఓట్లు సాధించారు. 151 సీట్లు సాధించిన జగన్మోహన్‌రెడ్డి హవాలో ఇన్ని ఓట్లు సాధించడం గొప్ప అంటున్నారు. గతంలో అక్కడినుంచి పోటీచేసిన దొరబాబుకి ఎదురుగారి వీస్తోందని అంటున్నారు. అక్కడ దొరబాబుపై పవన్ పోటీచేస్తే గెలవడం గ్యారంటీ అంటున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడి ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది.
ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తే ఆ ప్రభావం కాకినాడ అర్బన్, రూరల్, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాలపై ఉంటుందని, వీరంతా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈసారి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సాధ్యమయినంత ఎక్కువ సీట్లు సాధించాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీచేస్తే ఓడించేందుకు వైసీపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. సర్వేల ఫలితాలను విశ్లేషించి పవన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వుందంటున్నారు. ఏదిఏమైనా రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీచేసి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ కానుంది. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో తన సత్తా చాటుకోవాలని పవన్ భావిస్తున్నారు. టీడీపీ సాయంతో పవన్ గెలిస్తే మాత్రం వైసీపీ నేతలకు మాత్రం రాజకీయంగా ఇబ్బంది తప్పదనే భావన వ్యక్తం అవుతోంది.
Read Also: Hyper Aadi: గుండుకొట్టి హైపర్ ఆదిని అవమానించారు.. అసలు ఏం జరిగింది?