నేడు తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమిళనాడులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో పవన్ కల్యాణ్ ను అక్కడ పర్యటించాలని కోరడంతో ఈరోజు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమి అయిన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. కాగా ఎన్నికల్లో తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. కాగా చెన్నై సౌత్ పార్లమెంట్ స్థానం నుంచి ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై పోటీ చేస్తున్నారు.
ఆ ప్రాంతంలో అత్యధికంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు వారు స్థిరపడి ఉన్నారు. దీంతో తమిళిసై తరపున ఈ రోజు జనసేనాని పవన్ కల్యాణ్ రోడ్ షో లో పాల్గొననున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తరుఫు తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో టీడీపీ నేత నారా లోకేష్ ప్రచారం చేశారు.