ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఇరువురు నేతలు పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై సమీక్షించనున్నారు. 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రేపు రాత్రికి అమరావతికి రానున్నారు.
READ MORE: Mamata Banerjee: ‘‘మోడీకి గుడి కట్టించి, ధోక్లా ప్రసాదంగా ఇస్తాం’’.. ప్రధానిపై మమత సెటైర్లు..
కాగా.. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్నారు. మళ్లీ వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు.. సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే.. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే సంస్థలు తమ పనిని పూర్తిచేశాయి. పోలింగ్ తర్వత ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజుల గ్యాప్ రావడంతో సర్వే సంస్థలు ఎక్కువ మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి అవకాశం దొరికింది. సంస్థలతో పాటు.. కొందరు అభ్యర్థులు సైతం సర్వే ఏజెన్సీలతో ఫలితాలపై సర్వే చేయించినట్లు తెలుస్తోంది.