పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వినుకొండ మండలం శివాపురం వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో ట్రాలీ.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి వ్యవసాయ కూలీలను వినుకొండకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది.
మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ.. నేడు బిజీ షెడ్యూల్!
మరోవైపు ఏలూరు జిల్లా కైకలూరు మండలం రామవరంలో నాటు తుపాకీ మందు పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో నాటు తుపాకీలో ఉపయోగించే మందు తయారు చేస్తుండగా సామగ్రి పేలింది. ప్రమాదంలో చరణ్, సతీష్, మణి అనే ముగ్గురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. పక్షులను బెదిరించడానికి నాటు తుపాకీ మందు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.