Pakistan Rocket Force: పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్ రానున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యంలో కొత్తగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ క్షిపణుల దెబ్బతిన్న తర్వాత పాక్ కొత్తగా తన సైనిక దళంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
READ MORE: ECI Slams Rahul Gandhi: అదో చెత్త పదం.. ‘ఓట్ల చోరీ విధానం’పై స్పందించిన ఈసీఐ..
ప్రత్యేకమైన కమాండ్..
పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్తగా రానున్న రాకెట్ ఫోర్స్ గురించి ఆ దేశ సైనికాధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దీనికి ప్రత్యేకమైన కమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ క్షిపణుల మోహరింపు వంటి అంశాలను ఇదే చూసుకొంటుందని పేర్కొన్నారు. ఈ రాకెట్ ఫోర్స్‌ను ఇండియాను దృష్టిలో ఉంచుకొనే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయనే స్వయంగా మీడియా సంస్థకు వెల్లడించారు.
పాకిస్థాన్ ఈ కొత్త సైనిక విభాగంలో పెద్ద సంఖ్యలో సంప్రదాయ క్షిపణులు, రాకెట్లను మోహరించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ రాకెట్ ఫోర్స్‌లో ప్రధానంగా ‘ఫతా’ సిరీస్, ఇతర క్షిపణి వ్యవస్థలు ఉంటాయని సమాచారం. బ్రహ్మోస్, పృథ్వీ, అగ్ని సిరీస్‌ల వంటి భారతదేశ సుదూర క్షిపణి శక్తి ముందు తనను తాను సమతుల్యం చేసుకునే ప్రయత్నంగా పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ నిర్ణయాన్ని పాక్ సైనిక వ్యూహంలో మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయం భారతదేశ సైనిక వ్యూహంలో వచ్చిన మార్పుకు ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. భారత సైన్యం క్షిపణులను ఆధునిక సాంకేతిక ఆయుధాలను ఉపయోగించి కచ్చితమైన లక్ష్యంతో శత్రువును చావుదెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రస్తుత ఇండియా గతంలోనిది కాదని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రస్తుతం భారత్ రక్షణ సామర్థ్యం మునుపటి కంటే చాలా రెట్లు పెరిగిందనే సంకేతాలను ప్రపంచానికి ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇండియా తన రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంటోంది.