Supreme Court Questions EC: సుప్రీంకోర్టు గురువారం బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. 22 లక్షల మంది మరణించినట్లయితే బూత్ స్థాయిలో దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈసీని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను, వారి తొలగింపునకు గల కారణాలతో ఈనెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
READ MORE: No Plastic In AP Secretariat: ఏపీ సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్.. ఈ నెల 18 నుంచి అమలు..
తదుపరి విచారణ ఆగస్టు 22న..
సుప్రీంకోర్టు విచారణలో ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. “ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయి. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. వివాదాస్పదం కాని నిర్ణయమంటూ ఏదీ లేదు. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు” అని పేర్కొంది. ఈసీ వాదనలు విన్న అనంతరం.. అన్ని బూత్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల నుంచి నివేదికను తీసుకొని దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను స్థానిక వార్తాపత్రికలు, దూరదర్శన్, రేడియో లేదా ఏదైనా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. బూత్ వారీగా 65 లక్షల మంది జాబితాను ప్రదర్శించండి అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్‌మెంట్, పంచాయతీ కార్యాలయాల్లో బూత్‌ల వారీగా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలకు అవగాహన కలుగుతుందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న రానుంది.
READ MORE: Minister Anitha: రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్