Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి గురైన బాధితులు తాజాగా ఎన్టీవీతో సంభాషించారు. 2017లో కాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న సమయంలో వారి చేదు అనుభవాలను వివరిస్తూ ఆ సంఘటనలో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అనంతనాగ్ ప్రాంతంలో వారు బస్సు ఆపి, దాబా దగ్గర భోజనం చేసిన తరువాత తిరిగి బస్సులోకి ఎక్కగానే దాడి ప్రారంభమైందని తెలిపారు. దాదాపు 23 సంవత్సరాల్లోపు వయస్సున్న కొంతమంది యువకులు వచ్చి మూడు గ్రానైడ్లను వారి మీదకు విసరారని తెలిపారు. ఈ దాడిలో ఓ బాధితురాలి చెల్లలికి కుడి కాలు పోవడం బాధాకరమని తెలిపారు.
ఆ గ్రానైడ్లలోని ఇనుప ముక్కలు ఇప్పటికీ వారి శరీరాల్లో ఉన్నాయని తెలిపారు. కొంత దూరంలో ఆర్మీ క్యాంప్ ఉండటంతో అక్కడికి వెళ్లి తాము ప్రాణాలు దక్కించుకున్నామని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ‘సిలిండర్ పేలి గాయాలయ్యాయంటూ చెప్పాలని’ ఒత్తిడి చేసినట్లు తెలిపారు. అంతేకాక, అక్కడ వాళ్లు కనీసం తాగే ఛాయ్ లో కూడా ఉమ్మి చేసి ఇస్తున్నారని వివరించారు. “కాశ్మీర్ మన దేశంలో భాగం అనిపించుకోవాల్సిందే కానీ, వాస్తవికంగా పరిస్థితి అక్కడ లేదనిపిస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 ఘటన తరువాతే పహల్గాం దాడి జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, టెర్రరిస్టులను ఉపేక్షించరాదని బాధితులు కోరారు. అలాగే “మాకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేదు కానీ.. కాశ్మీర్‌లో శాంతి, భద్రత కోసం మార్పులు అవసరం” అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కూడా పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసే వారు ఉన్నారని, అలాంటి వారి పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.