కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ దాడిపై పాకిస్థాన్ హస్తం ఉందా? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Pahalgam Terror Attack : క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. మహేశ్ బాబు, విజయ్..
ఇటీవల దాయాది దేశం ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అది తమ జీవనాడి అని, దానిని మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు. ‘‘విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ పిల్లలకు పాక్ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంది’’ అని మాట్లాడారు. ‘‘ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్థాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..?’’అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే కశ్మీర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం’’ అంటూ బీరాలు పలికారు.
READ MORE: BJP MPs: ” ఇది పాకిస్థాన్ పనే” ఉగ్రవాద ఘటనపై బీజేపీ ఎంపీల రియాక్షన్..
ఈ వ్యాఖ్యలు చేసిన వారంలోపే దాడి జరిగింది. దీంతో పాకిస్థాన్ సైన్యం, పాక్ ప్రభుత్వంపై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారతదేశం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వ్యాఖ్య వెలువడినప్పటికీ.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం లేదా భారత సైన్యం ఈ దాడిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ఆసిఫ్ లైవ్ 92 న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. “ఈ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆదేశంలో పుట్టిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉద్యమాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు, దక్షిణాన ఛత్తీస్‌గఢ్, మణిపూర్ లాంటి ప్రదేశాలన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.” అని పేర్కొన్నారు. ఈ వరుస ఘటనలు చూస్తుంటే పాకిస్థాన్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి?